Saturday, June 2, 2012

అలుపెరుగని పోరాట గాథ‘గోండుల జీవితం’


భారతదేశం విభిన్న మతాల, జాతుల, కులాల, సంస్కృతుల సమాహారం. సాహిత్యం సమాజ ప్రతిబింబం అనుకున్నప్పుడు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సాహిత్యానికి మించిన ఆధారాలు లేవు. ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ప్రధాన జీవన స్రవంతిలో భాగం కాకుండా, మైదాన ప్రాంతాలకు దూరంగా- కొండల్లో, కోనల్లో, అడవుల్లో జీవిస్తున్న ఆటవిక (గిరిజన) తెగలు ఎన్నో ఉన్నాయి. ఆధునిక కాలంలో గిరిజనులు చేస్తున్న పోరా టాలు భూమి కోసమే. ఆ పోరాటంలో మరణించిన గిరిజన యోధులు ఎందరో. భూమికోసం, నీటికోసం గోండులు సాగించిన పోరాటాలను ‘అడవిలో వెన్నెల’ కథల సంపుటి నిరూపించింది.
 ‘అడవిలో వెన్నెల’ కథల సంపుటి 1985లో వెలువడింది. ఈ కథల సంపుటికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో పదిహేను కథలున్నాయి. ఆ కథలను రాసిన రచయితల పేర్లు మాత్రం పేర్కొనలేదు. వీరు ఉద్యమాల్లో భాగంగా ఉంటూ రాసిన వాళ్ళుగా కనిపిస్తారు. నిజానికి జానపద సాహిత్యంలో చాలా వాటికి రచయితల పేర్లు ఉండవు. ఆ బాణిలోనే ఈ కథల సంపుటిని వెలువరించారనిపిస్తుంది. ఈ సంపుటిలో కథలు రాసిన రచయితలు స్వయంగా గిరిజన గోండు గుడారాలను సందర్శించి, వాళ్ళ జీవితాలను దగ్గరనుండి చూసి రాసినవారు. అడవి సర్వ సంపదకి కేంద్రం. కానీ, ఆ అడవుల్లో జీవించే గోండులు నీటికోసం పడుతున్న బాధలు ఇంతా అంతా కాదు. నీటి కోసం మైళ్ళ దూరం నడవాలి. గోండుల గుడారాలు మైదాన ప్రాంతానికి దూరంగ కొండల్లో, కోనల్లో ఉండడం వల్ల కనీస సౌకర్యాలను పొందలేకపోతున్నాయి. గోండులు నీళ్ళకు వర్షాల పైనో, కాలవల పైనో ఆధారపడాల్సివస్తోంది. దట్టమైన అడవిలో నీటికోసం వెళ్ళినపుడు కొన్ని సార్లు కొందరు అడవి మృగాల బారిన పడి మరణిస్తున్నారు. ఈ విషయాన్ని ‘కన్నీటి కథ నీటికథ’లో చిత్రితమైంది. ఈ కథలో ప్రధాన పాత్ర సక్కుబాయి. సక్కుబాయి నిండుచూలాలు. ఒకరోజు నీటి కోసం వెళ్ళిన సుక్కుబాయి గుట్ట దిగలేక కడుపు మంటతో ‘కన్న వారిని, కట్టుకున్న వాడిని, జులంతో పన్నులు గుంజే సర్కార్‌ను ‘సత్తెనాసయిపోను’(పుట:19) అని శాపం పెడుతుంది. అంతలో ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. సుక్కబాయి అటు ఇటు చూస్తుంది. ఒక గుడ్డెలుగు కనిపిస్తుంది. సుక్కుబాయి భయపడి, అరచి బొబ్బలు పెడుతుంది. ‘గుడ్డెలుగు కొట్టిన దెబ్బకు కడుపులో బిడ్డ నేలతల్లి ఒడిలో’ పడుతుంది. నిజానికి ఆ గోండు గుడాల్లో నీరు చేదు కోవడానికి ఒక బావి లాంటిది ఎదో ఒకటి ఉండి ఉంటే, సుక్కుబాయి జీవితం మరోలా ఉండేది. సుక్కుబాయి కడుపులో ఎన్నో ఆశలతో పెరుగుతున్న పసిబిడ్డ లోకాన్ని చూడకుండానే వెళ్ళిపోయేది కాదేమో!

మనిషి వ్యవసాయం చేయడం ఒక గొప్ప పరిణామదశ. ఆ దశలో భూమిని సాగు చేయడంలో నిష్ణాతుడైనవాడే రైతు. వాడికే భూమిమీద హక్కు ‘దున్నేవాడిదే భూమి’ అన్నట్టు! సారవంతమైన భూమిని ఆశించే గిరిజనుడు ప్రకృతి వైపరీత్యాలకు, కౄరమృగాలకు భయపడడు. తాను సాగుచేసిన భూమిపై ఏనా డూ హక్కు ఆశించలేదు. కాలక్రమంలో గిరిజనులకు కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అప్పడి నుండే గిరిజనులకు అసలైన సమస్య మొదలైంది. అప్పటి వరకు ఒక ప్రాంతంలో ఒకటి, రెండు సంవత్సరాలు ఉండిపోయే గిరిజనుడు- అప్పటి నుండి శాశ్వతంగా ఉండిపోతాడనే భయం గిరిజనేతరులకు పట్టుకోంది. దానితో చట్టాలను తమకు అనుకులంగా మార్చుకొని ఆ భూములను తమ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ‘అడవిలో వెన్నెల’ కథలో గోండులు పూట గడవని పరిస్థితి నుండి బయటపడడం కోసం భూమి కావాలనుకున్నాడు. ఐదు రూపాయల కథలో షావుకారు రామయ్య. కొమురం జంగు షావుకారికి అప్పు పడతాడు. జంగు కొడుకు రాంసావు. రామయ్య ఆ గూడెంపై కన్నేసి ఉండడంతో సోలెడు ఇచ్చి, అడ్డెడు తీసుకొని, చివరికి వాళ్ళకు అప్పులు కూడా ఇవ్వడం మొదలు పెడతాడు. చూస్తూ ఉండగానే రామయ్య వందెకరాల భూమికి ఆసామి అవుతాడు. జంగు దగ్గర ఉన్న మేకలు, ఆవులు, జొన్నలు మొదలైనవి అన్నీ రామయ్య పరమైపోతాయి. కానీ, జంగు అప్పు తీరదు. జంగు చనిపోతాడు. అతని కొడుకు రాంసావు ఆ అప్పు కట్టలేక వున్న భూమిని షావుకారికిచ్చి, చివరికి అతడి పొలాల్లోని పని చేసుకుంటూ ఉండిపోతాడు. బాకీ తీరదు. జంగు ఖాతా లోని అయిదు రూపాయల అప్పు అలానే మిగిలిపోయింది. ఒక యథార్థ సంఘటనకు ప్రతి రూపం ఈ కథ. ప్రతి గోండు జీవితం ఒక కథగా కనబడుతుంది. దోపిడీ చేయడం, దోపిడీకి గురి కావడం ఉన్నంత కాలం జీవితాల్లో నాటకీయత ఉండక తప్పదు. ఆ విషయాన్నే జీవితం పరిధిలో రచయిత అద్భుతంగా చెప్పాడు. దీనికి తోడు గిరిజనులు అడవి మృగాల కంటే ఎక్కువ భయపడేది ఫారెస్టు అధికారులకు, ప్రభుత్వ అధికారులకు. ఎందుకంటే ఏదో ఒక వంకతో గిరిజన గూడెనికి వెళ్ళి అమాయకమైన గిరిజన స్ర్తీలను చేరదీయడం, లైంగికంగా వేదనలకు గురిచేయడం జరుగుతుంటుంది. గిరిజనులు శరీరాన్ని మరిచిపోయి పనులు చేస్తుంటారు. అందుకే ‘రక్తపింజెర’ కథలో మల్కుబాయి పాము కాటుకు మరణించింది. మరణించినా గానీ, గిరిజనుల చేసిన శ్రమకు సరిపడ కూలి ఇవ్వకుండా కాంట్రాక్టర్‌ శర్మ ఎలా మోసం చేశాడో ఈ కథ చిత్రించింది. ఇలా ఏ కథను తీసుకున్నా, ఏదో ఒక రూపంలో గోండులు పోరాట పటిమ ప్రదర్శించినా, చివరికి న్యాయం జరగలేదని తెలుస్తోంది. rames1
గిరిజన జీవితాల్లోని అనేక చీకటి కోణాలను, అందుకు గల కారణాలను, వ్యవస్థను ఈ కథలు విశ్లేషించాయి. ఈ కథల్లో గిరిజనులు తమకు కావల్సిన కనీస అవసరాల కోసం ప్రకృతితో, సంప్రదాయాలతో, గిరిజనేతర వ్యవస్థలతో పోరాటం చేశారు. చట్టబద్ధమైన ప్రభుత్వ యత్రాంగం ఆదివాసీలకు సహకరిం చాల్సిందిపోయి వారిని అణచివేసేదిగా, దోపిడీ చేసేదిగా మారింది. భారతీయ సమాజం అన్ని భౌగోళిక ప్రాంతాలకు, జాతులకు, పౌరసత్వం కల్గిన ప్రతి పౌరునికి సమాన అవకాశాలు కల్పించింది. కాని అవి అందుబాటులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో జరిగిన, జరుగుతన్న ఆదివాసీ ఉద్యమాలకు మద్దతుగా ‘అడవిలో వెన్నెల’ కథల సంపుటి వారి ఆశలను, ఆరాటాలను, పోరాటాలను అక్షరీకరించింది. అలుపెరగని పోరాట గాథే ఒక గోండు జీవితంగా నిరూపించింది. 
-జరుపుల రమేష్
(ఈ వ్యాసం సూర్య దినపత్రికలో ప్రచురితం)

తెలుగు సాహిత్యం గిరిజన స్ర్తీ స్వేచ్ఛాన్వేషణ



తెలుగు సాహిత్యంలో స్ర్తీవాద ఉద్యమం ఇరవయ్యో శతాబ్దంలో వచ్చింది. తెలుగులో ఈ వాదం పాశ్చాత్య ప్రభావంతో వచ్చిందన్నది నిర్వివాదం. తెలుగులో నన్నయ నుండి మొదలుపెడితే నేటి వరకు- ఏదో ఒక రకంగా స్ర్తీల చిత్రణ జరుగుతూనే ఉంది. పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు మొదలైన అన్ని ప్రక్రియలు స్ర్తీకి సముచితమైన స్థానాన్ని ఇచ్చాయి. తొలిదశ సాహిత్యంలో గిరిజనుల స్థితిగతులను పరిశీలించాలను కునేటప్పుడు పూర్వపరాలకు వెళ్ళవలసిన అవసరం ఉంది. గిరిజన స్ర్తీల ప్రస్తావన గురించి ప్రాచీనకాలం నుండి చూస్తే, భారతంలో ‘హిడింబి’, రామాయణంలో ‘శబరి’ మొదలైన గిరిజన స్ర్తీల పాత్రలు కనిపిస్తుంటాయి. మధ్యయుగ భారత దేశంలో సమ్మక్క, సారక్క, రాణి దుర్గావతి వంటి గిరిజన స్ర్తీలు రాజ్యాల్ని పాలించిన దాఖాలాలు ఉన్నాయి. అలాంటి గిరిజన స్ర్తీలు ఆధునిక కాలం వచ్చేసరికి ఎటువంటి చట్రంలో మునిగిపోయారనే అంశాన్ని చరిత్ర వివరి స్తోంది. సాధన రాసిన ‘రాగో’ నవలలో గిరిజన స్ర్తీ ఎటువంటి బాధలకు గురవుతోందో వివరించే ప్రయత్నం జరిగింది.

సాధన రెండు నవలలు రాశాడు. అందులో ఒకటి ‘సరిహదు’్ద, రెండు ‘రాగో’. రాగో నవల 1993లో ప్రచురితమైంది. గోండుల సంస్కృతి సంప్రదాయలలో గిరిజన స్ర్తీ పడే అవస్థలు, ఉద్యమ పోరాటంలో గిరిజనుల బతుకును చిత్రించిది ఈ నవల. రాగో యుక్త వయస్కురాలైన (మాడియా) గోండు యువతి. రాగో తల్లిదండ్రులు- ఆమె మేనమామ కొడుకు ‘సంఘె’తో పెళ్ళికి ఒప్పుకుంటారు. కాని రాగోకి ఆ పెండ్లి ఇష్టం లేదు. అదే ఊరిలో ‘నాన్సు’ అనే వ్యక్తిని ప్రేమిస్తుంటుంది. కానీ ఆ సంబంధాన్ని రాగో తల్లిదండ్రులు ఒప్పుకోరు. రాగో తనకు ఇష్టంలేని పెండ్లి చేసుకోవడం కంటే అడవు ల్లోకి వెళ్ళి బతకడం మేలని భావించుకొని ఇంటినుండి పారిపోతుంది. ఆ క్రమంలో అన్నలతో పరిచయం అవుతుంది. అప్పటి వరకు తాను గిరిజన సమాజంలో చూసిన తారతమ్యాలు బయట సమాజంలో కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురవుతుంది.

వెంటనే రాగో ఎలాగైనా గిరిజనుల్లో ఉన్న మూఢ వ్యవస్థను, అమాయకత్వాన్ని నిర్మూలించి, చైతన్యాన్ని తేవాలని అనుకుంటుంది. ఆ ఆశతోనే దళంలో కలిసి స్వల్ప వ్యవధిలోనే పై స్థాయికి ఎదుగుతుంది. అనేక గిరిజన గుడారాలు తిరిగి వాళ్ళల్లో్ల మార్పు తెస్తుంది. ఆ మార్పుకు తన జీవితాన్నే ప్రతీకగా చూపిస్తుంది. చివరికి ఆమె తండ్రి కూడా రాగో- పార్టీ సభ్యత్వాన్ని ఆమోదిందచడంతో నవల ముగుస్తుంది. సమాజంలో, కుటుంబంలో స్ర్తీల అణిచివేతను ఖండిస్తూ, లైంగిక పరంగా తమను తక్కువగా చూడటాన్ని నిరసిస్తూ స్ర్తీ విముక్తి కోసం- నేటి విధానాలలోని లోపాలను రూపు మాపడానికి స్ర్తీ, పురుషులు చేపట్టిన వినూత్న మార్గమే స్ర్తీవాదం. స్ర్తీవాదంలో మూడు ప్రధానమైన ధోరణులు కనిపిస్తాయి. అవి లిబరల్‌ ఫెమినిజమ్‌, రాడికల్‌ ఫెమినిజమ్‌, సోషలిస్టు ఫెమినిజం. ఈ మూడు ప్రధాన ధోరణుల్లో స్ర్తీవాద సాహిత్యాన్ని పరిశీలిస్తున్నారు.

‘రాగో’ నవలలో, రాగో గోండు స్ర్తీ. గోండు భాషలో రాగో అంటే రామచిలుక. పంజరంలో ఉన్న చిలుక. పంజరంలో ఉన్న రామచిలుక స్వేచ్ఛ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూంటుంది. ఈ నవలలో రాగో అనే మాడియా గోండి స్ర్తీ కూడా స్వేచ్ఛకోసం చూసి చూసి, చివరికి తానే ధైర్యం తెచ్చుకొని జనజీవన స్రవంతిలోకి వెళ్ళిపోతుంది. అందుకే రచయిత రాగోను పంజరంలో చిలుకకు సంకేతంగా చిత్రించాడని తెలుస్తుంది. గిరిజన స్ర్తీకి స్వేచ్ఛ రోజు రోజుకీ కనుమరుగై పోతూ ఉంది. గిరిజనులు సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను పాటిం చడం వల్లే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది.

గిరిజన స్ర్తీకి ఎదురవుతున్న పరిస్థితులను ఒకసారి అవలోకనం చేస్తే, మొదట ఎదురయ్యే సమస్య విద్య లేకపోవడం. గిరిజనులు అడవుల్లోనే జీవించడం వల్ల విద్యకు అంతగా ఆసక్తి చూపరు. అవకాశాలూ తక్కువ. చదువుకోవాలనే ఆసక్తి చూపినా కేవలం పురుషులకు మాత్రమే విద్య అందుబాటులో ఉంటుంది. గిరిజనులు స్ర్తీ విద్యను నిరాకరించడానికి కొన్ని కారణాలు కనిపిస్తుంటాయి. స్ర్తీ చదువుకుంటే కూలికి వెళ్ళేదెవరని, పైగా స్ర్తీలు చేతికింద ఉంటే అనేక పనుల్లో సహాయపడతారని కుటుంబం భావించుకుంటుంది. అదొక కారణం అయితే, మరొక కారణం స్ర్తీలు చదువుకుంటే, చదువుకున్న వ్యక్తికే ఇచ్చి పెళ్ళిచేయాల్సి ఉంటుంది. అంత వరకట్నం ఇవ్వలేమనే ఉద్దేశంతో స్ర్తీలను చదివించడం పట్ల ఆసక్తి చూపరు.

అలాగే గిరిజనులు సమాజానికి కొంత దూరంగా ఉండడం, చదువు వల్ల కలిగే ప్రయోజనాలు తెలియకపోవడం కూడా ఒక కారణం. గిరిజన స్ర్తీ వరకట్నానికో, ఓలికో అంగడి వస్తువై బాల్యవివాహమనే చట్రంలో ఇరుక్కుంటుంది. అందుకే రాగో నవలలో- రాగోకి ఇష్టంలేని పెళ్ళి చేయదలిచిన రాగో తండ్రి దల్సు కి రాగో తగిన బుద్ధి చెప్తుంది. గిరిజనుల్లో స్ర్తీల అభిప్రాయాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. రాగో నవలకు మూల కారణం మాడియా కులంలో ఆచరిస్తున్న లామడే (ఇల్లరికం). రాగో తండ్రి దల్సు- రాగో కోసం సంఘెని- లామడేగా పెట్టుకుంటాడు. దల్సు అంటే రాగోకు ఇష్టముండదు. కాని నిర్ణయించిన సాంప్రదాయానికి, లేక కులాచారాల కట్టుబాట్ల వల్ల వీరిద్దరికీ పెళ్ళి చేయాలని నిర్ణయిస్తారు.

దాంతో స్ర్తీ మనస్సును తెలుసుకోకుండానే అనేక పనులు జరిగిపోతున్నాయని అర్థమౌతుంది. రాగో అనుకున్నట్టు తనను వేరే వాడితోనో, లేక తాను ప్రేమించిన వ్యక్తితోనో పెండ్లి జరిపిస్తే తన తండ్రికి పోయేదేమిటని ప్రశ్నించుకుంటుంది. కానీ, అలా జరగలేదు. పూర్వం కాలం నుండి పితృస్వామ్య వ్యవస్థలో స్ర్తీ పడే బాధల గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి. గిరిజనుల్లో కూడా పితృస్వామ్య వ్యవస్థలో స్ర్తీలు పడే బాధలకు నిదర్శనంగానే రాగో కనిపిస్తుంది. ఈ నవలల్లో రాగో వేసుకున్న ప్రశ్నలు గిరిజన స్ర్తీకే కాకుం డా, సమస్త లోక స్ర్తీల కందరికి సంబంధించిన సమస్యలుగా పరిగణించాల్సిన అవసరంఉంది. నాగరిక సమా జంలో ఉండే స్ర్తీలకి, గిరిజన సమాజంలో ఉండే స్ర్తీలకి మధ్య వారధిగా రాగో చిత్రితమయింది. అందుకే స్ర్తీకి కూడా హృదయం ఉంటుందని గమనించాలనేది రాగో బాధ.

సైమన్‌ డి బొవియర్‌ ‘పుట్టుకతోనే ఎవరూ ఆడవాళ్ళు కారు, పుట్టిన తరువాత ఆడవాళ్ళుగా తయారవుతారు’ అని వివరించారు. మాడియా మహిళ తరతరాలుగా అనుభవిస్తున్న ఈ చిత్రహింసలకు తెల్లారేదెప్పుడు అనేది- ఆనాటికి రాగోకు అర్థం కాని, పరిష్కారం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. గోండు కులంలో స్ర్తీలకు బహిష్టు సమస్య పెద్ద గుదిబండగా మారింది. ఆ ఐదు రోజులు ఎవరికి కనబడరాదు, ఎవరిని ముట్టుకోవద్దు. ఆ పరిస్థితిలో స్ర్తీని పట్టించుకునే వాళ్ళే కరవవు తుంటారు. తనను కన్న తల్లి కూడా ఆ ఆచారాన్ని జవదాట వద్దంటుంది. దీని మీద గోపి భాగ్యలక్ష్మి ‘జంగుబాయి’ కథ అద్భుతంగా చిత్రించారు. వర్షాలు పడినా, విపరీతమైనా ఎండలు కొట్టినా ఆ స్ర్తీకి గూడెంకు దూరంగా, తన కుటుంబానికి దూరంగా ఐదు రోజులు ఉండాల్సిన పరిస్థితి ఈ గోండు సంప్రదాయంలో ఉంది.

ప్రాచీన కాలం కంటే ఆధునిక కాలంలో స్ర్తీలకు అనేక సమస్యలు వస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక రకంగా గిరిజనేతరుల చేతిలోనో లేదా, దారి దోపిడీ వాళ్ళ చేతిలోనో గిరిజన స్ర్తీ మోసపోతున్న సంఘటనలు కోకొల్లలు. ఏ విషయంలోనైనా గిరిజన స్ర్తీ చిన్నచూపుకే గురవుతోంది. అందుకే స్ర్తీవాద సాహిత్యం వచ్చాక ‘ఆకాశంలో సగం’ అనే సాహిత్య పోరాటం ప్రారంభమైంది. ఈ విధానం గిరిజన సమాజంలో ఇంకా బలంగా పుంజుకోలేదు. గిరిజనులు కూడా మారాలి. తమ ఆచారాల్లో మార్పులు తెచ్చుకోవాలి. లేకపోతే ఆ ఆచారాలను విడవాల్సిన అవసరం ఉంది. స్ర్తీని కేవలం అంగడి వస్తువుగానో, లేక ముడిసరుకుగానో చూడడం ఇక కుదరదు. స్ర్తీ కూడా మన లాంటి మనిషేనన్న భావన కలగాలి. అది గిరిజనుల్లో తప్పనిసరిగా, పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది.
రాగో ఇంటి నుండి పారిపోయి వచ్చిన తరువాత అడుగడుగున ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఆ బాధను భరించలేకే అన్నల్లో కలిసిపోయింది. రాగో జనజీవన స్రవంతిల్లోకి వచ్చిన తరువాత ‘జైని’ గా పేరు మార్చుకోని గోండు కులంలో మూఢాచారాలను, సంప్రదాయాలను నిర్మూలించడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలోనే గోండు స్ర్తీలకు అనేక విద్యలు నేర్పింది. మహిళా సంఘాలను పెట్టించింది. రాగో ద్వారా గోండు స్ర్తీలలో కొంతమేరకైనా స్వేచ్ఛ, చైతన్యం వచ్చాయి. స్ర్తీ కేవలం వంటింటికే పరిమితమైపోదని రాగో నిరూపించింది. డిప్యూటీ కమాండర్‌గా తక్కువ కాలంలో ఎదగడమే- రాగో గిరిజన లోకానికి అందించిన మార్పు. 
- జరుపుల రమేష్

Tuesday, October 11, 2011

తలచుకోడానికైనా మిగలని ‘తాండా’!

తలచుకోడానికైనా మిగలని ‘తాండా’!
banjara-photo

సాహిత్యంలో నేటికి అనేక రకాలైన ప్రక్రియ లు చోటుచేసుకొని ఉన్నాయి. ప్రస్తుత తరు ణంలో నూతనంగా ప్రవేశిస్తున్న ప్రక్రియ, చేరడానికి ఆవశ్యకత ఉన్న ప్రక్రియ గిరిజన సాహిత్యం. తెలు గులో గిరిజన సాహిత్యం ఏ రకంగా ఉంది, అసలు ఉందా, ఉంటే ఎవరు రాశారు, అందులో ఏ తెగల జీవితాలు చిత్రితమయ్యాయి- అనే సవాలక్ష ప్రశ్న లు- మనకు మనం వేసుకోవల్సిన తరుణం. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన సాహిత్యాన్ని తేవాల్సిన అవసరం, రాయా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. గిరిజన సాహిత్యం లేదా బంజారాల గురించి అనువాదాలు ఏమైనా వచ్చాయా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు- ‘తాండా’ నవల తారసపడింది. ఈ నవల కన్నడంలో ‘హవన’ పేరుతో వెలువడింది.

దానిని ‘హిరేమఠ్‌’ రాశాడు. తెలుగులో జయశ్రీ మోహన్‌ రాజ్‌, ఎస్‌ మోహన్‌ రాజ్‌ అనువదించారు. ఈ నవలలో లంబాడాల సంస్కృతిని ఎంతో గొప్పగా చిత్రిం చారు. వారి దినచర్య, వారి పండుగలు, కట్టుబాట్లు, స్థూలంగా మొత్తం లంబాడాల సంస్కృతి కనిపిస్తుంది. ఈ నవలలో కర్ణాటక ప్రాంతంలో ఉన్న లంబాడీల గురించి చిత్రించారు.ప్రాంతం వేరు కావచ్చు, రాష్ట్రం వేరు కావచ్చు- కానీ, బంజా రాల జీవితం ఎక్కడున్నా ఒక్కటేననే భావన ఈ నవల చదివిన పాఠకుడికి కలుగుతుంది. నవలలో తాండా నాగరిక ప్రపం చానికి దూరంగా తనదైన సంస్కృతితో, సమష్టి తత్త్వంతో ఉండే లంబాడా తండాలలో ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార నాగరికత ప్రవేశించడం వల్ల అక్కడి మానవ సంబంధాలు ఎలా మారిపోయాయో చిత్రించింది ఈ నవల.

సాహిత్యంలో చిత్రించిన బంజారాల సంస్కృతిని ఆధారంగా చేసుకొని, ప్రస్తుత బంజారాల సంస్కృతిని అంచనా వేస్తే అనేక విషయాలు దృష్టికి వస్తాయి. ప్రపం చంలో ఎక్కడున్నా బంజారాల సంస్కృతిని గుర్తు పట్టేంత స్థాయికి ఎదిగింది. కానీ, అటువంటి సంస్కృతి నేడు అంతిమ దశకు చేరుకుంటోంది. సాహిత్యాన్ని ప్రామాణికంగా తీసుకొని బంజారాల సంస్కృతిని అంచనా వేస్తే చాలా తేడాలు కనిపిస్తాయి. అందుకే తాండా రచయిత బంజారాల జీవితాన్ని ఎంతో ఉన్నతం గా, హృద్యయంగా చిత్రించారు.
ప్రాచీన కాలం నుండి బంజారాలు ఉన్నారని చీనాయ్య నాయక్‌ లాంటి పరిశోధకుల వల్ల తెలు స్తోంది. బంజారాల చరిత్రను అలా ఉంచితే, తర తరాలుగా వస్తున్న బంజారా సంస్కృతిలో భాగ మైన దుస్తుల పరిస్థితి ఏమిటి? బంజారాల దుస్తు లకు నేడు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ ఉన్నప్పటికి, బంజారాలకు మాత్రం దూరమ వ్వసాగాయి. అసలు బంజారాలు అటువంటి దుస్తులు వేయడానికి కారణమేమిటి? నేడు ఎందుకు దూరంగా పెట్టుకుంటున్నారు. పన్నెండవ శతాబ్దంలో పృథ్వీరాజ్‌ చౌహాన్‌ రెండవ తైరాన్‌ యుద్దంలో ఓడిపోయాడు. దాంతో ముస్లిం సైన్యాలు పృథ్వీ రాజ్‌ చౌహాన్‌కు చెందిన వారందర్ని తరిమికొట్టడం మొదలు పెట్టారు. భయంతో పృథ్వీరాజ్‌ ఆస్థానంలో ఉన్న బంజారాలు అడవుల్లోకి వెళ్ళిపోయి తలదాచుకున్నారు.

వేషం మారిస్తే అడవి మనుషుల్లాగా ఉంటామని గ్రహించి, అప్పటి వరకు ఉన్న వేషాన్ని మార్చివేసి చెట్ల ఆకులతో, జంతువుల దంతాలతో కొన్ని వస్తువులను తయారుచేసుకొని ధరించడం మొదలుపెట్టారు. అలా క్రమ క్రమంగా బంజారాల దుస్తులు ఒక రకమైన సౌందర్యంతో ఆకట్టుకునే విధంగా తయారయ్యాయి.
బంజారాల దుస్తులు కొంత బరువుతో కూడినవి, కొంత శ్రమతో కూడినవి. ఎందుకంటే వాటిని తయారు చెయ్యడానికి నెలల తరబడి కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి తయారు చేస్తే దాదాపు చిరిగిపోవడం అరుదు. బంజారాల్లో పురుషులు వేసుకొనే దుస్తుల కంటే, స్ర్తీలు వేసుకునే దుస్తులకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది.

పది సంవత్సరాల క్రితం ఏ తాండాకు వెళ్ళినా బంజారా స్ర్తీలు తమ వేషధారణలో కనిపిస్తుండేవారు. కానీ, నేటి పరిస్థితి అలా లేదు. ఒక మండలం పరిధిలో ఉన్న తండాలన్ని తిరిగినా, బంజారా స్ర్తీలు తమ వేషధారణలో కనిపించ రు. ఎక్కడో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ముసలివాళ్ళు, ఇంకా ఆధునిక దుస్తులు ధరించలేని, ధరించే శక్తి లేని వాళ్ళు తప్ప మరెవరూ ఆ సంప్రదాయ దుస్తుల్లో కనిపించరు. ఎందుకు బంజారాలు తమ దుస్తులకు దూరమవుతున్నారు? స్ర్తీలు గిరిజన దుస్తులైన పెట్యా, కాళీ ధరించాల్సినది పోయి ఆధునిక దుస్తులైన చీర, రవిక ధరిస్తున్నారు. పురుషులు కూడా తమ తమ సంప్రదాయ దుస్తులను ధరించకుండా ప్యాంట్‌, షర్ట్‌ ధరిస్తున్నారు.

అభివృద్ధి చెందాలని ప్రతి మనిషికీ ఉంటుంది. ప్రభుత్వం కూడా అదే దిశలో కృషిచేయడానికి ప్రయత్నిస్తోంది. నిరంతరం ధరించకపోయినా, కనీసం పండుగలప్పుడైనా, పెళ్ళిళ్ళప్పుడైనా ధరిస్తే బాగుండేది. ఇది కూడా కనుమరుగయ్యే స్థితి వచ్చింది.బంజారాల తరతరాల నుండి వస్తున్న పండుగ తీజ్‌. తీజ్‌ పండుగంటే బంజారా లకు ఎంతో ఇష్టం. శ్రీకృష్ణుడు రాధా గోపికలతో జల క్రీడలో ఉన్నప్పుడు గోవుల సంగతి మర్చిపోతాడు. ఆ తర్వాత జ్ఞాపకం వచ్చి, ఎనిమిది రోజులు ఎక్కడ వెదికినా దొరకక నిరాశ చెంది ఇంటి ముఖం పట్టగా ఆవు పేడ కనిపించింది. ఆ పేడలో చిన్న చిన్న మొలకలు కనిపించాయి. ఆ మొలకను శ్రీకృష్ణుడు నువ్వెవరని ఆడిగితే ‘నేను భాగీరథిని’ అని సమాధానం ఇస్తుంది.

అప్పటి నుండి మొలకల పండుగ జరుపుకుంటున్నారు. దానికి కాలక్రమం లో ‘తీజ్‌’ పండుగగా పేరు మారింది.తీజ్‌ పండుగను రాజస్థాన్‌, హర్యానా మొదలగు రాష్ట్రాలలో పెద్ద పండుగగా నేటికి జరుపుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి లేదు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలలో ‘తిజేరి ఓల్డ్‌ కమరాయి జా/ కమరాయి జా సారీరాత్‌ కీఢళ ఖోజా/ మారీ సాతణురో మూండో కమరాయిజా సారీరాత్‌కీలోఢళఖోజ్‌జా’ అనే పాటతో పలకరించే తాండాలో నేడు అవేమి వినిపించడం లేదు. ఎక్కడా కనిపించడం లేదు. ఒక్కప్పుడు తాండాలో ఉన్న యుక్త వయస్కురాలైన స్ర్తీలు తీజ్‌ పండుగ ఎప్పుడొస్తుందని ఎదురు చూసే వారు.

ఈ పండుగను తొమ్మిది రోజులు ఎంతో ఆనందంగా జరు పుకుంటారు. నేడు తీజ్‌ పండుగను మరొక పండుగతో కలిపి చేసుకుంటున్నారు. ప్రధానంగా హిందువుల పండుగలు నాటి నుండి ఆచరణలో ఉన్నా, అవీ బంజారాల పై అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ, ప్రపంచీ కరణ నేపథ్యంలో వచ్చిన మార్పు, వస్తున్న మార్పులు బంజారాల పండుగలపై విపరీతంగా ప్రభావం చూపాయని చెప్పవచ్చు. బంజారాలు తమ సంస్కృతికి దూరమై అన్య సంస్కృతికి అలవాటు పడ్డారని, పడుతున్నారని తెలుస్తోంది. అన్య సంస్కృతికి అలవాటు పడడం మంచిదే. కానీ పూర్వ సంస్కృతినీ కాపాడుకోవల్సిన అవసరం ఉంది.

తీజ్‌పండుగ స్థానంలో తాండాలలో ‘వినాయక చవితి’ ప్రవేశించింది.ఆధునికంగా వచ్చిన మార్పు వల్ల ఈ విధానం మారింది. మార్పు మంచిదే. కానీ అసలుకే మోసం వస్తేనే అసలు సమస్య ఎదురౌతుంది. ఈ రోజులలో ప్రతి వారూ ఎవరి ఉనికిని వాళ్ళు కాపాడుకోవడానికి, నిలుపు కోవడానికి తంటా లు పడుతున్న తరుణం. ఒక్క క్షణం కూడా తీరిక లేనంటువంటి కంప్యూటర్‌ యుగంలో తొమ్మిది రోజులు వృథా చేసుకొని తీజ్‌ పండుగను జరుపుకోవడానికి ఎలా ముందుకు వస్తారు? ఇలాంటి పరిస్థితుల వల్లనే బంజారాల సంస్కృతి రోజు రోజుకు క్షీణించిపో తోంది. ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళ తరువాత ఆంధ్రదేశంలో బంజారాల సంస్కృతి కనుమరుగయ్యే స్థితి ఏర్పడుతుంది. దీనిని బంజారా సమాజం గుర్తించాలి.

ఆధునికంగా అభివృద్ధి సాధించినా, తమ ఆస్తిత్వాన్ని మరిచిపోకూడదు. నిరం తరం తమ ఆస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండాలి. అందుకే పూర్వ కాలం నుండి మానవుడు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్నో పోరాటాలు, సాహసాలు చేశాడు. అప్పుడే ఒక తరంలో ఉన్నటువంటి భావాలు మరో తరానికి అందుతాయి. లేకపోతే అవి అంతటితోనే కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ మధ్య అనుకరణ అనేది తప్పనిసరిగా మారింది. సాధారణంగా సాహిత్యం లో అనుసరణ పాటిస్తుంటాం. కానీ, ఆ అనుసరణ కేవలం సాహిత్యంలోనే కాకుం డా, జీవితంలో కూడా ఎక్కువ స్థాయిలో అమలు జరుగుతోందని చెప్పవచ్చు.
ఒక ప్రాంతంలో చేసే, పండుగలు, ఆచారాలు మరో ప్రాంతంలో చేయడానికి ప్రజలు వెనకడుగు వేయడం లేదు. ఈ అనుకరణ, లేదా అనుసరణ వల్లే బంజారాలు తీజ్‌ పండుగను మరచిపోయి, వినాయకచవితి పాటిస్తున్నారు. అలాగే దుస్తుల విషయంలో కూడా అనుసరణకే ప్రాముఖ్యత. బంజారాల సంస్కృతిలో భాగమైన అనేక అంశాలు నేడు కనుమరుగయ్యే స్థితి. ఈ తరుణంలో బంజారాల సంస్కృతి రికార్డు చేయడానికి కొన్ని రచనలు సాహిత్య రూపంలో రావల్సిన తరుణం ఆసన్న మైంది. లేకపోతే కొన్నాళ్ళ తరువాత ఎవరి సంస్కృతి ఎలాంటిది, ఎవరి దుస్తులు ఎలాంటివి అనేవి అర్థం కావు. ఇప్పటికే బంజారా దుస్తులను బంజారేతరులు, సినిమా పరిశ్రమవారు విపరీతంగా వాడుకుంటున్నారు. వాటి స్థానంలో కొత్త మార్పులు ప్రవేశింప జేసి, బంజారాల సంస్కృతి ఒక్కప్పుడు అలా ఉండేదా? అనే సందిగ్ధాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు కోవల్సిన అవసరం ప్రతి బంజారాకు ఉంది.
ఈ వ్యాసం 10.10.2011 రోజు సూర్య లో ప్రచురితమైంది.