Saturday, June 2, 2012

అలుపెరుగని పోరాట గాథ‘గోండుల జీవితం’


భారతదేశం విభిన్న మతాల, జాతుల, కులాల, సంస్కృతుల సమాహారం. సాహిత్యం సమాజ ప్రతిబింబం అనుకున్నప్పుడు సమాజాన్ని అర్థం చేసుకోవడానికి సాహిత్యానికి మించిన ఆధారాలు లేవు. ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కూడా ప్రధాన జీవన స్రవంతిలో భాగం కాకుండా, మైదాన ప్రాంతాలకు దూరంగా- కొండల్లో, కోనల్లో, అడవుల్లో జీవిస్తున్న ఆటవిక (గిరిజన) తెగలు ఎన్నో ఉన్నాయి. ఆధునిక కాలంలో గిరిజనులు చేస్తున్న పోరా టాలు భూమి కోసమే. ఆ పోరాటంలో మరణించిన గిరిజన యోధులు ఎందరో. భూమికోసం, నీటికోసం గోండులు సాగించిన పోరాటాలను ‘అడవిలో వెన్నెల’ కథల సంపుటి నిరూపించింది.
 ‘అడవిలో వెన్నెల’ కథల సంపుటి 1985లో వెలువడింది. ఈ కథల సంపుటికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో పదిహేను కథలున్నాయి. ఆ కథలను రాసిన రచయితల పేర్లు మాత్రం పేర్కొనలేదు. వీరు ఉద్యమాల్లో భాగంగా ఉంటూ రాసిన వాళ్ళుగా కనిపిస్తారు. నిజానికి జానపద సాహిత్యంలో చాలా వాటికి రచయితల పేర్లు ఉండవు. ఆ బాణిలోనే ఈ కథల సంపుటిని వెలువరించారనిపిస్తుంది. ఈ సంపుటిలో కథలు రాసిన రచయితలు స్వయంగా గిరిజన గోండు గుడారాలను సందర్శించి, వాళ్ళ జీవితాలను దగ్గరనుండి చూసి రాసినవారు. అడవి సర్వ సంపదకి కేంద్రం. కానీ, ఆ అడవుల్లో జీవించే గోండులు నీటికోసం పడుతున్న బాధలు ఇంతా అంతా కాదు. నీటి కోసం మైళ్ళ దూరం నడవాలి. గోండుల గుడారాలు మైదాన ప్రాంతానికి దూరంగ కొండల్లో, కోనల్లో ఉండడం వల్ల కనీస సౌకర్యాలను పొందలేకపోతున్నాయి. గోండులు నీళ్ళకు వర్షాల పైనో, కాలవల పైనో ఆధారపడాల్సివస్తోంది. దట్టమైన అడవిలో నీటికోసం వెళ్ళినపుడు కొన్ని సార్లు కొందరు అడవి మృగాల బారిన పడి మరణిస్తున్నారు. ఈ విషయాన్ని ‘కన్నీటి కథ నీటికథ’లో చిత్రితమైంది. ఈ కథలో ప్రధాన పాత్ర సక్కుబాయి. సక్కుబాయి నిండుచూలాలు. ఒకరోజు నీటి కోసం వెళ్ళిన సుక్కుబాయి గుట్ట దిగలేక కడుపు మంటతో ‘కన్న వారిని, కట్టుకున్న వాడిని, జులంతో పన్నులు గుంజే సర్కార్‌ను ‘సత్తెనాసయిపోను’(పుట:19) అని శాపం పెడుతుంది. అంతలో ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. సుక్కబాయి అటు ఇటు చూస్తుంది. ఒక గుడ్డెలుగు కనిపిస్తుంది. సుక్కుబాయి భయపడి, అరచి బొబ్బలు పెడుతుంది. ‘గుడ్డెలుగు కొట్టిన దెబ్బకు కడుపులో బిడ్డ నేలతల్లి ఒడిలో’ పడుతుంది. నిజానికి ఆ గోండు గుడాల్లో నీరు చేదు కోవడానికి ఒక బావి లాంటిది ఎదో ఒకటి ఉండి ఉంటే, సుక్కుబాయి జీవితం మరోలా ఉండేది. సుక్కుబాయి కడుపులో ఎన్నో ఆశలతో పెరుగుతున్న పసిబిడ్డ లోకాన్ని చూడకుండానే వెళ్ళిపోయేది కాదేమో!

మనిషి వ్యవసాయం చేయడం ఒక గొప్ప పరిణామదశ. ఆ దశలో భూమిని సాగు చేయడంలో నిష్ణాతుడైనవాడే రైతు. వాడికే భూమిమీద హక్కు ‘దున్నేవాడిదే భూమి’ అన్నట్టు! సారవంతమైన భూమిని ఆశించే గిరిజనుడు ప్రకృతి వైపరీత్యాలకు, కౄరమృగాలకు భయపడడు. తాను సాగుచేసిన భూమిపై ఏనా డూ హక్కు ఆశించలేదు. కాలక్రమంలో గిరిజనులకు కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అప్పడి నుండే గిరిజనులకు అసలైన సమస్య మొదలైంది. అప్పటి వరకు ఒక ప్రాంతంలో ఒకటి, రెండు సంవత్సరాలు ఉండిపోయే గిరిజనుడు- అప్పటి నుండి శాశ్వతంగా ఉండిపోతాడనే భయం గిరిజనేతరులకు పట్టుకోంది. దానితో చట్టాలను తమకు అనుకులంగా మార్చుకొని ఆ భూములను తమ సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ‘అడవిలో వెన్నెల’ కథలో గోండులు పూట గడవని పరిస్థితి నుండి బయటపడడం కోసం భూమి కావాలనుకున్నాడు. ఐదు రూపాయల కథలో షావుకారు రామయ్య. కొమురం జంగు షావుకారికి అప్పు పడతాడు. జంగు కొడుకు రాంసావు. రామయ్య ఆ గూడెంపై కన్నేసి ఉండడంతో సోలెడు ఇచ్చి, అడ్డెడు తీసుకొని, చివరికి వాళ్ళకు అప్పులు కూడా ఇవ్వడం మొదలు పెడతాడు. చూస్తూ ఉండగానే రామయ్య వందెకరాల భూమికి ఆసామి అవుతాడు. జంగు దగ్గర ఉన్న మేకలు, ఆవులు, జొన్నలు మొదలైనవి అన్నీ రామయ్య పరమైపోతాయి. కానీ, జంగు అప్పు తీరదు. జంగు చనిపోతాడు. అతని కొడుకు రాంసావు ఆ అప్పు కట్టలేక వున్న భూమిని షావుకారికిచ్చి, చివరికి అతడి పొలాల్లోని పని చేసుకుంటూ ఉండిపోతాడు. బాకీ తీరదు. జంగు ఖాతా లోని అయిదు రూపాయల అప్పు అలానే మిగిలిపోయింది. ఒక యథార్థ సంఘటనకు ప్రతి రూపం ఈ కథ. ప్రతి గోండు జీవితం ఒక కథగా కనబడుతుంది. దోపిడీ చేయడం, దోపిడీకి గురి కావడం ఉన్నంత కాలం జీవితాల్లో నాటకీయత ఉండక తప్పదు. ఆ విషయాన్నే జీవితం పరిధిలో రచయిత అద్భుతంగా చెప్పాడు. దీనికి తోడు గిరిజనులు అడవి మృగాల కంటే ఎక్కువ భయపడేది ఫారెస్టు అధికారులకు, ప్రభుత్వ అధికారులకు. ఎందుకంటే ఏదో ఒక వంకతో గిరిజన గూడెనికి వెళ్ళి అమాయకమైన గిరిజన స్ర్తీలను చేరదీయడం, లైంగికంగా వేదనలకు గురిచేయడం జరుగుతుంటుంది. గిరిజనులు శరీరాన్ని మరిచిపోయి పనులు చేస్తుంటారు. అందుకే ‘రక్తపింజెర’ కథలో మల్కుబాయి పాము కాటుకు మరణించింది. మరణించినా గానీ, గిరిజనుల చేసిన శ్రమకు సరిపడ కూలి ఇవ్వకుండా కాంట్రాక్టర్‌ శర్మ ఎలా మోసం చేశాడో ఈ కథ చిత్రించింది. ఇలా ఏ కథను తీసుకున్నా, ఏదో ఒక రూపంలో గోండులు పోరాట పటిమ ప్రదర్శించినా, చివరికి న్యాయం జరగలేదని తెలుస్తోంది. rames1
గిరిజన జీవితాల్లోని అనేక చీకటి కోణాలను, అందుకు గల కారణాలను, వ్యవస్థను ఈ కథలు విశ్లేషించాయి. ఈ కథల్లో గిరిజనులు తమకు కావల్సిన కనీస అవసరాల కోసం ప్రకృతితో, సంప్రదాయాలతో, గిరిజనేతర వ్యవస్థలతో పోరాటం చేశారు. చట్టబద్ధమైన ప్రభుత్వ యత్రాంగం ఆదివాసీలకు సహకరిం చాల్సిందిపోయి వారిని అణచివేసేదిగా, దోపిడీ చేసేదిగా మారింది. భారతీయ సమాజం అన్ని భౌగోళిక ప్రాంతాలకు, జాతులకు, పౌరసత్వం కల్గిన ప్రతి పౌరునికి సమాన అవకాశాలు కల్పించింది. కాని అవి అందుబాటులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో జరిగిన, జరుగుతన్న ఆదివాసీ ఉద్యమాలకు మద్దతుగా ‘అడవిలో వెన్నెల’ కథల సంపుటి వారి ఆశలను, ఆరాటాలను, పోరాటాలను అక్షరీకరించింది. అలుపెరగని పోరాట గాథే ఒక గోండు జీవితంగా నిరూపించింది. 
-జరుపుల రమేష్
(ఈ వ్యాసం సూర్య దినపత్రికలో ప్రచురితం)

No comments:

Post a Comment